ఇప్ప పువ్వు సారాపై తనకున్న అవగాహనను తక్కువ అంచనా వేయవద్దని, దీనిపై అసెంబ్లీ వేదికగా రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తానని కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన, తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్‌కు తన ప్రసంగమే సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి ఇప్ప పువ్వుకు ఉందని అన్నారు.
గతంలో ఇప్ప పువ్వు సారా తాగిన వారు 115 ఏళ్లు ఆరోగ్యంగా బతికారని, కానీ ప్రస్తుతం వస్తున్న కల్తీ బ్రాండ్ల వల్ల ప్రజలు 60 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్ప పువ్వు సారాను శాస్త్రీయంగా ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తే, రాష్ట్రానికి ఏకంగా రూ. లక్ష కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని ఆయన లెక్కలు వేశారు. దీనిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చవచ్చని కూడా సూచించారు. అడవుల్లో ఇప్ప పువ్వు సేకరించే గిరిజన సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే, ఇప్ప పువ్వు సారాకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.
రేపు శాసనసభలో ఇప్ప పువ్వు సారా విధానంపై తాను ప్రసంగించబోతున్నానని, ఈ సారా తయారీ వెనుక ఉన్న శాస్త్రీయత, ఆర్థిక లాభాలను గణాంకాలతో సహా వివరిస్తానని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ట్రోల్స్ చేసే వారు తన ప్రసంగం విన్నాక అభిప్రాయం మార్చుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.