తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి... కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలు, నకిలీ సాక్ష్యాల సమస్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 11న జరిగే అవకాశం ఉంది.

భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), 2023లోని సెక్షన్లు 215, 379లను ఉన్నది ఉన్నట్లుగా అన్వయించడం వల్ల పలు శిక్షాస్మృతి నిబంధనలు నీరుగారిపోతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లను తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లతో, కోర్టులను తప్పుడు కేసులతో ముంచెత్తుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం తప్పుడు కేసుల బాధితులు నేరుగా న్యాయపోరాటం చేసేందుకు కోర్టు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కావడం, జవాబుదారీతనానికి ఇది అడ్డంకిగా మారిందని పిటిషనర్ వాదించారు.

తప్పుడు కేసుల బెదిరింపుల వల్ల అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో ఒక కుటుంబం తప్పుడు కేసుల బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, తప్పుడు కేసుల బాధితులు నేరుగా కోర్టు అనుమతితో ఫిర్యాదు చేసేలా బీఎన్ఎస్ఎస్ చట్టంలోని నిబంధనలకు సరైన భాష్యం చెప్పాలని పిటిషనర్ కోరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని, అమాయక పౌరులను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News