ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి పతనమైన భారత రూపాయికి ఈరోజు స్వల్ప ఊరట లభించింది. ఇరాన్‌కు చెందిన విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో రూపాయి విలువ పుంజుకుంది. సోమవారం నాటి చారిత్రాత్మక కనిష్ఠ స్థాయి నుంచి కోలుకుని, డాలర్‌తో పోలిస్తే 93.64 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

నిన్న‌ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 0.37 శాతం క్షీణించి, డాలర్‌తో 93.98 వ‌ద్ద‌ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు ఎగబాకడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. భారత్ నికర దిగుమతిదారు కావడంతో అధిక ముడిచమురు ధరల వల్ల దిగుమతుల బిల్లు పెరిగిపోయి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ముడిచమురు ధరలు ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగి, వృద్ధి అంచనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ ప్రకటనను మార్కెట్ వర్గాలు స్వాగతించినప్పటికీ, ఈ రికవరీపై పూర్తి విశ్వాసంతో లేవని నిపుణులు చెబుతున్నారు. ఉద్రిక్తతలు తగ్గే దిశగా మరిన్ని సానుకూల సంకేతాలు వస్తేనే రూపాయి మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరలు అధికంగా ఉన్నంత కాలం రూపాయి బలహీనంగానే కొనసాగుతుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో రూపాయి విలువ డాలర్‌తో 93.25 నుంచి 94.25 మధ్య బలహీనంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గత రెండు రోజులుగా ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ట్రంప్ చెప్పడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను కొంత మెరుగుపరిచింది. అయితే, ట్రంప్ ప్రకటనను ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్-బాఘేర్ ఘలీబాఫ్ ఖండించారు. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రూపాయి రికవరీ ఎంతకాలం నిలుస్తుందనేది అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల గమనంపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News