క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈసారి నిజామాబాద్‌లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడిని నగరానికి తీసుకురానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఫ్యాన్ పార్క్‌ను నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల జాబితాలో నిజామాబాద్‌కు చోటు దక్కడంతో స్థానిక క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ సీజన్ రెండో వారంలో అంటే ఏప్రిల్ 4, 5 తేదీల్లో (శనివారం, ఆదివారం) నిజామాబాద్‌లో ఈ ఫ్యాన్ పార్క్‌ను నిర్వహించనున్నారు. స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేని అభిమానుల కోసం, వారికి కూడా స్టేడియం తరహా అనుభూతిని అందించాలనే లక్ష్యంతో బీసీసీఐ 2015లో ఈ ఫ్యాన్ పార్క్ విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వేలాది మంది అభిమానుల కేరింతలు, డీజే సంగీతం, ఇతర హంగామాతో అచ్చం స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కల్పిస్తారు.

ఈ ఫ్యాన్ పార్కులో కేవలం మ్యాచ్‌ల ప్రసారమే కాకుండా, ఇది ఒక చిన్నపాటి పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. అభిమానులను ఆకట్టుకునేందుకు రుచికరమైన ఆహారంతో కూడిన ఫుడ్ కోర్టులు, చిన్నారుల కోసం ప్రత్యేక గేమింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్, ఫొటో బూత్‌లు, ఫేస్ పెయింటింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అభిమానులు తమకు ఇష్టమైన జట్లకు, ఆటగాళ్లకు మద్దతు తెలుపుతూ సందడి చేయవచ్చు.

ఈనెల 28న బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 


More Telugu News