రింగ్ రోడ్డుపై ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. పెద్ద కూతురు పరిస్థితి విషమం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జూబ్లీహిల్స్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర (23), దిశీర (19) తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ సమీపంలో రాత్రి సుమారు 8.52 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న అభిరామ రెడ్డి, డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి కూడా గాయాలపాలయ్యారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితులు ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు వేగంగా వెళుతున్న సమయంలో, ముందు వెళుతున్న ఒక డీసీఎం వాహనం టైరు అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఆ వాహనం ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోవడంతో, వెనుక నుంచి వస్తున్న ఫార్చ్యూనర్ కారును డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. అతివేగంగా ఉన్న కారు డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఫార్చూనర్ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.


ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పెద్ద కుమార్తె అక్షర పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్న కుమార్తె దిశీరకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రికి చేరుకుని, అక్షర ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.



More Telugu News