ధురంధర్-2లో ఓ సీన్‌లో కెమెరామన్ కూడా కనిపించడంపై నెటిజన్ల ట్రోలింగ్

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇంత పెద్ద హిట్ సినిమాలో దొర్లిన ఓ చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా, సూక్ష్మ విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడని పేరున్న దర్శకుడు అదిత్య ధర్‌ను నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తున్నారు.

విషయంలోకి వెళితే, సినిమాలో ఓ కీలకమైన ఫైట్ సీన్‌లో ఈ మిస్టేక్ జరిగింది. రెండు పాత్రల మధ్య బాత్రూమ్‌లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు, కెమెరా వెనక్కి జరగ్గా.. అద్దంలో కెమెరామన్ ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. కెమెరా పట్టుకుని ఉన్న ఆ వ్యక్తిని నెటిజన్లు వెంటనే గుర్తించి, ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

సాధారణంగా అదిత్య ధర్ తన సినిమాల్లోని 'పీక్ డీటెయిలింగ్'కు ప్రసిద్ధి. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా చూపిస్తాడని ఆయనకు పేరుంది. ఇప్పుడు అదే 'పీక్ డీటెయిలింగ్' అనే పదాన్ని వాడుతూ, 'కెమెరామన్‌ను కూడా చూపించడం పీక్ డీటెయిలింగ్' అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరు 'ఇది పీక్ డీటెయిలింగ్ తప్పుదారి పట్టింది' అని కామెంట్ చేయగా, మరికొందరు 'క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కూడా ఇలాంటి పొరపాటు జరిగింది' అంటూ పోలుస్తున్నారు.

ఈ వైరల్ వ్యవహారంపై దర్శకుడు అదిత్య ధర్ ఇంకా స్పందించలేదు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిన్న పొరపాటు సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, ఆన్‌లైన్‌లో మరింత బజ్ క్రియేట్ చేయడానికి దోహదపడింది.


More Telugu News