సౌదీపై ఇరాన్ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఓ తెలుగు వ్యక్తిని బలిగొన్నాయి. సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల కారణంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన రవిగోపాల్ అనే వ్యక్తి మృతి చెందినట్టు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మార్చి 18వ తేదీ రాత్రి సౌదీ రాజధాని రియాద్‌లోని కీలక లక్ష్యాలపై ఇరాన్ నాలుగు క్షిపణులను ప్రయోగించింది. అయితే సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గాలిలోనే కూల్చివేశాయి. దురదృష్టవశాత్తూ, కూల్చివేసిన క్షిపణి శకలాలు రియాద్‌లోని ఒక ఆయిల్ రిఫైనరీ సమీపంలో పడ్డాయి. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న రవిగోపాల్‌పై ఈ శకలాలు పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ మాట్లాడుతూ... మృతుడి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్న భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.