: 'సిట్' చేతికి చిక్కిన డ్రగ్ సప్లయర్.. రోహిత్ రెడ్డికి 24 సార్లు డెలివరీ?

షార్ట్స్‌లో చూడండి

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగం పెంచింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలోని బృందం, ఈ డ్రగ్స్ మాఫియాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అభిషేక్, ప్రవృత్తిగా డ్రగ్స్ సరఫరాను ఎంచుకుని.. బడా రాజకీయ నేతలకు 'సరుకు' చేరవేస్తున్నట్లు సిట్ నిర్ధారించింది.


విచారణలో బయటపడిన సంచలన విషయాల ప్రకారం... బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి, అభిషేక్ సింగ్‌కు మధ్య వారధిగా ఆయన డ్రైవర్ శరత్ వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు శరత్ నేరుగా అభిషేక్ దగ్గర నుండి డ్రగ్స్ సేకరించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. గత కొంతకాలంగా సుమారు 24 సార్లు రోహిత్ రెడ్డికి అభిషేక్ డ్రగ్స్ పంపినట్లు కాల్ డేటా ద్వారా సిట్ గుర్తించింది. అభిషేక్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులోని వాట్సాప్ చాట్లు మరియు మెసేజ్‌లను విశ్లేషిస్తున్నారు. ఇందులో ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు ఉన్నాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.


ఈ డ్రగ్స్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదని, దీని వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం కూడా ఉండవచ్చని సిట్ అనుమానిస్తోంది. అభిషేక్ సింగ్ ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నాడు? గోవా లేదా ముంబై నెట్‌వర్క్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Go Back to Shorts

More Telugu News