ఒకేచోట 5 భారీ కొండచిలువలు.. హిమాచల్‌లో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్!

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఓ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఓ ఆలయం సమీపంలో ఏకంగా ఐదారు భారీ కొండచిలువల గుంపు కనిపించడం కలకలం రేపింది. గహ్లియాన్ ప్రాంతంలోని ప్రసిద్ధ కాళోఠారే వాలీ మాత ఆలయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. మొదట నేల మీద చెట్టు వేర్లు ఉన్నాయని స్థానికులు భావించారు. దాని ఆకారం వింతగా ఉన్నప్పటికీ ఎవరూ అనుమానించలేదు.

అయితే, కొందరు వ్యక్తులు సరదాగా ఆ గుంపుపై రాయి విసరడంతో అసలు విషయం బయటపడింది. ఆ గుంపు ఒక్కసారిగా కదలడంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అది చెట్ల వేర్ల గుంపు కాదని, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న భారీ కొండచిలువల గుట్ట అని గ్రహించి భయంతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... సుమారు 5 నుంచి 6 భారీ కొండచిలులువలు ఆ గుంపులో ఉన్నాయి. జనం గమనించిన కొద్దిసేపటికే అవి వేగంగా చెల్లాచెదురై సమీపంలోని పొదల్లోకి జారుకున్నాయి.

ఈ భయానక దృశ్యాన్ని అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద సంఖ్యలో కొండచిలువలు ఒకేచోట గుంపుగా కనిపించడం చాలా అరుదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆలయానికి సమీపంలో, అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ఈ ఘటనపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సాధారణంగా కొండచిలులువలు మనుషుల జోలికి రావని, తమంతట తాముగా దాడి చేయవని వన్యప్రాణి నిపుణులు చెప్పారు. అయితే, వాటిని రెచ్చగొట్టినా, ఇబ్బంది పెట్టినా లేదా వాటికి అపాయం ఉందని భావించినా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


More Telugu News