ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గురుగ్రామ్‌లో ఆకర్షిస్తున్న ఎల్పీజీ ఏటీఎం

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, గురుగ్రామ్‌లో ఏర్పాటు చేసిన ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం అందరినీ ఆకర్షిస్తోంది. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎమ్‌ను ఈ నగరంలో ప్రారంభించారు. దీనితో గ్యాస్ అయిపోతే గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కేవలం 2 నుండి 3 నిమిషాల్లోనే నింపిన సిలిండర్‌ను పొందవచ్చు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గత ఏడాది పైలట్ ప్రాజెక్టులో భాగంగా సోహ్నాలోని సెక్టార్ 22, సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఈ స్మార్ట్ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేసి, ఓటీపీ ద్వారా సిలిండర్ తీసుకోవచ్చు. అక్కడి క్యూఆర్‌ కోడ్‌ ను స్కాన్ చేసి ఏదైనా యూపీఐ ఐడీ ద్వారా చెల్లింపులు జరపాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక యంత్రం నుంచి సిలిండర్ వెలుపలకు వస్తుంది. ఖాళీ సిలిండర్ లోపలకు వెళ్లిపోతుంది.

సాధారణంగా అందరూ వినియోగించే సిలిండర్లతో పోలిస్తే ఈ ఏటీఎం సిలిండర్లు తేలికగా ఉంటాయి. సాధారణ సిలిండర్‌ లు గ్యాస్‌తో కలిపి 31 కిలోల బరువు ఉంటాయి. కానీ ఏటీఎం సిలిండర్లు ఫైబర్‌తో తయారు చేసినవి ఉంటాయి. గ్యాస్‌తో కలిపి 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. భారత్ గ్యాస్ కాంపోజిట్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ ఎల్పీజీ ఏటీఎం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ సమయంలోనైనా మిషన్ నుంచి సిలిండర్ తీసుకోవచ్చు. ఇందులో ఒకేసారి 10 సిలిండర్లు నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. నిల్వ తగ్గినప్పుడు గ్యాస్ ఏజెన్సీకి సందేశం వెళుతుంది. 


More Telugu News