ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి

కృష్ణాజిల్లా యనమలకుదురులో ఓ ఏఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వీరవల్లి గోపి వెంకట దుర్గాప్రసాద్ (54) మృతదేహం కరకట్ట శివారులోని ఒక పాకలో లభ్యమైంది.


ఒక కేసు విషయంలో 15 రోజుల క్రితమే దుర్గాప్రసాద్ సస్పెన్షన్‌కు గురయ్యారు. విధులకు దూరం కావడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతదేహం నిర్జన ప్రదేశంలో కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


దుర్గాప్రసాద్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా హతమార్చారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.



More Telugu News