'నేను బతికే ఉన్నా'.. అమెరికా రాయబారితో నెతన్యాహు వీడియో

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన మరణంపై కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి వీడియో ద్వారా గట్టిగా సమాధానమిచ్చారు. తాను బతికే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేస్తూ మంగళవారం ఒక వీడియోను విడుదల చేశారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి ఆయన ఈ వీడియోలో కనిపించారు. ఈ పరిణామంతో నెతన్యాహు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తీవ్ర ప్రచారానికి తెరపడినట్లయింది.

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో నెతన్యాహు వరుసగా ఏడు కేబినెట్ సమావేశాలకు హాజరుకాలేదని, ఆయన తీవ్రంగా గాయపడ్డారని లేదా మరణించారని ఆన్‌లైన్‌లో విస్తృతంగా వదంతులు వ్యాపించాయి. గతంలో ఆయన కార్యాలయం విడుదల చేసిన వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన 'డీప్‌ఫేక్' అని, ఒక వీడియోలో ఆయనకు ఆరు వేళ్లు ఉన్నాయని కూడా ప్రచారం చేశారు. ఈ పుకార్లను తిప్పికొట్టేందుకే నెతన్యాహు తాజా వీడియోను విడుదల చేయాల్సి వచ్చింది.

ఈ వీడియో సంభాషణలో, హకబీ తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ, "మీరు క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కోవాలని డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపారు" అని అన్నారు. దీనికి నెతన్యాహు వెంటనే స్పందిస్తూ, "అవును మైక్, నేను బతికే ఉన్నాను" అని బదులిచ్చి, ఆయనతో కరచాలనం చేశారు. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించినది కాదని చెప్పే ప్రయత్నంలో, తన చేతికి ఐదు వేళ్లు ఉన్నాయని చూపిస్తూ చమత్కరించారు.

అనంతరం, నెతన్యాహు తన చేతిలో ఓ 'పంచ్ కార్డ్' చూపిస్తూ ఇరాన్‌పై తమ వైఖరిని స్పష్టం చేశారు. "ఇది ఒక పంచ్ కార్డ్. ఈ రోజు ఈ కార్డుపై ఉన్న  ఇద్దరి పేర్లను చెరిపేశాను. ఈ బ్యాచ్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి. మేం వాళ్లను తుడిచిపెట్టేస్తున్నాం" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. దీనికి హకబీ హాస్యంగా, "మంచి విషయం ఏంటంటే.. ఈ పంచ్ కార్డులో నా పేరు లేదు" అనగా, నెతన్యాహు నవ్వుతూ, "మీరు మంచి వాళ్ల జాబితాలో ఉన్నారు" అని బదులిచ్చారు. అనంతరం, "అణు ఆయుధాలను అభివృద్ధి చేసి, ఇజ్రాయెల్‌ను నాశనం చేశాక అమెరికాలోని ప్రతి నగరంపై దాడి చేయాలనుకుంటున్న ఉన్మాదులను ఏరివేయడంలో అమెరికా దళాలు చేస్తున్నది అద్భుతం. వారితో కలిసి నిలబడటం మాకు గర్వకారణం" అని నెతన్యాహు అన్నారు.

హకబీ కూడా తన 'ఎక్స్' ఖాతాలో, "ఈ రోజు నేను ఇజ్రాయెల్ ప్రధానితో సమావేశమయ్యాను. ఆయన చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపించారు. దీనికి విరుద్ధంగా వచ్చే వార్తలన్నీ నకిలీవే" అని పోస్ట్ చేశారు.


More Telugu News