బ్రాండ్ వాల్యూ కోసం కుట్రలు.. సహచర ఆటగాళ్లపై అశ్విన్ అనుమానం?

భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఒక "వ్యాధి" ప్రబలుతోందని, కొందరు ఆటగాళ్లు తమ బ్రాండ్ విలువను పెంచుకునేందుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఆర్మీల ద్వారా ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రచారాలను నడిపిస్తున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ఒక వ్యవస్థీకృత వ్యాపార నమూనాగా కూడా మారి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.

ఓ కార్యక్రమంలో మాట్లాడిన అశ్విన్.. "సోషల్ మీడియాలో ఫ్యాన్ ఆర్మీల ద్వారా కనిపించే చాలా అభిప్రాయాలను నేను అంతకుముందే ప్రత్యక్షంగా విన్నాను. కొన్నిసార్లు బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ టేబుల్ వద్ద విన్న మాటలే, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వేరొకరి పేరుతో దర్శనమిస్తాయి. ఇది ఎలా జరుగుతుందో అని ఆశ్చర్యం వేస్తుంది" అని తెలిపాడు. ఆటగాళ్లే నేరుగా ఈ ప్రచారాలు చేయిస్తున్నారని తాను ఆరోపించడం లేదని, కానీ దీని వెనుక ఏదో వ్యాపార నిర్మాణం ఉందనిపిస్తోందని అన్నాడు. ఇది చాలా భయానకమైన విషయమని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

"ఈ రోజుల్లో ప్రతీ ఆటగాడు ఒక వ్యాపారవేత్తగా మారిపోయాడు. తమ బ్రాండ్ విలువ, పీఆర్ పెంచుకోవడానికి ఇలాంటివి చేస్తుండొచ్చు. దాన్ని నేను తప్పుబట్టను. కానీ, దానికోసం మరో క్రికెటర్ గురించి చెడుగా మాట్లాడటం మాత్రం నేను ఎప్పటికీ చేయను" అని అశ్విన్ స్పష్టం చేశాడు.

భారత క్రికెట్‌లో పాతుకుపోయిన 'సూపర్‌స్టార్ కల్చర్' వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అశ్విన్ విమర్శించాడు. "మనం ఆటగాళ్ల చుట్టూ కథలు అల్లుతూ, వారిని హీరోలుగా, సినిమా తారలుగా చూపిస్తున్నాం. అసలు ఆట గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరూ మాట్లాడటం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

కొంతకాలం క్రితం శుభ్‌మన్ గిల్ ఔటవుతున్న తీరుపై తాను చేసిన ఒక సాంకేతిక విశ్లేషణను ఈ సందర్భంగా అశ్విన్ గుర్తుచేశాడు. "నేను ఎప్పుడూ ఆటలో 'ఏమిటి', 'ఎందుకు' అనే అంశాలపైనే దృష్టి పెడతాను. కానీ, నేను గిల్ గురించి మాట్లాడగానే, చాలామంది దాన్ని 'ఎందుకు గిల్ గురించే మాట్లాడావు, ఇతరుల గురించి ఎందుకు మాట్లాడలేదు' అంటూ వ్యక్తిగత పోలికలకు తీసుకువెళ్లారు" అని వాపోయాడు. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News