ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధంతో మనకేం ప్రయోజనం?: అమెరికా కీలక అధికారి రాజీనామా

ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వలేనంటూ అమెరికాకు చెందిన కీలక అధికారి ఒకరు రాజీనామా చేశారు. అమెరికా జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న జో కెంట్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ మన దేశానికి తక్షణ ముప్పు ఏమీ కలిగించలేదని అన్నారు. ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగానే ఈ యుద్ధం ప్రారంభమైందని అన్నారు.

యుద్ధం కోసం ఇజ్రాయెల్‌తో పాటు దాని శక్తిమంతమైన అమెరికన్ లాబీ నుంచి ఒత్తిడి వచ్చిందని ఆరోపించారు. తాను చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. ఒకవైపు హర్మూజ్‌ను రక్షించడానికి అన్ని దేశాలు కలిసి రావాలని ట్రంప్ విజ్ఞప్తి చేస్తుండగా, ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి తరుణంలో కీలక అధికారి రాజీనామా చేయడం గమనార్హం.

ఈ మేరకు జో కెంట్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. మూడు అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మీరు ప్రచారం చేసిన విలువలకు, మొదటి హయాంలో అమలు చేసిన విదేశాంగ విధానాలకు మద్దతుగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ యుద్ధాలు మన పౌరులు, సైన్యం ప్రాణాలు తీయడంతో పాటు దేశ సంపదను క్షీణింపజేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కానీ ఇటీవల ఉన్నతస్థాయి ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియాలోని ప్రభావవంతమైన కొందరు వ్యక్తులు ఇరాన్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఇది 'అమెరికా ఫస్ట్' అనే నినాదాన్ని దెబ్బతిసి, ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లేలా చేసిందని వాపోయారు. ఇరాన్ అణుకేంద్రాలు అమెరికాకు తక్షణ ముప్పుగా పరిణమించిందని, ఇప్పుడు దాడి చేస్తే విజయం సాధించవచ్చని నమ్మించారని ఆరోపించారు.

గతంలో ఇరాక్, ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోకి అమెరికన్లను లాగడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేసిందని అన్నారు. ఇలాంటి తప్పులను అమెరికా ప్రభుత్వం మళ్లీ చేయవద్దని కోరారు. 11 సార్లు యుద్ధానికి వెళ్లిన ఒక సైనికుడిగా, ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధంలో భార్యను కోల్పోయిన వ్యక్తిగా చెబుతున్నానని, ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధాలు అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవని పేర్కొన్నారు. ఇలాంటి యుద్ధాలకు అమెరికన్ పౌరులను పంపించడాన్ని తాను సమర్థించలేనని అన్నారు. మనం ఇరాన్‌లో ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నామో పునరాలోచించుకోవాలని ట్రంప్‌కు రాసిన లేఖలో కెంట్ పేర్కొన్నారు.


More Telugu News