బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు
రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు నేడు డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందని ఆరోపిస్తూ ఆయన డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఆదరణను చూసి ఓర్వలేకనే కక్షపూరితంగా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోటీ చేయవద్దని హెచ్చరించినా ధైర్యంగా నిలబడిన బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, సాక్షాత్తూ పోలీసులే దాడులకు పాల్పడటం దారుణమని ధ్వజమెత్తారు. గతంలో నల్గొండ ఎస్పీ, నిన్న పరిగి సీఐ బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేసిన ఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హోం శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అరాచకాలపై తక్షణమే స్పందించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ అంతా కాంగ్రెస్ కార్యకర్తల విభాగంలా మారిపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే, రాష్ట్ర డీజీపీ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందిస్తూ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఒకవేళ విచారణలో న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు.