రాజకీయ ఒత్తిళ్లపై రజనీకాంత్ క్లారిటీ.. అవన్నీ అవాస్తవాలే!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయ నిర్ణయంపై చెలరేగిన వివాదంపై స్పందించారు. డీఎంకే పార్టీ ఒత్తిడి వల్లే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. "సమయం మాట్లాడదు. కానీ వేచి చూసి సమాధానం ఇస్తుంది" అంటూ తనదైన శైలిలో బదులిచ్చి, ఈ ఆరోపణలకు ముగింపు పలికారు.

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఈ నెల‌ 12న చెన్నైలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డీఎంకే నాయకత్వం బెదిరించడం వల్లే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోయారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో రజనీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్నది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, దీని వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్ప‌ష్టం చేశారు. చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వివిధ పార్టీల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు మంత్రి ఎస్. రఘుపతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే, థోల్. తిరుమావళవన్, ఎస్.పి. వేలుమణి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, బీజేపీ నేత అర్జునమూర్తి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, టీఎంఎంకే నేత జాన్ పాండియన్ వంటి అనేక మందికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ ప్రవేశం చాలా కాలంగా ఆసక్తి రేపుతున్న విషయం తెలిసిందే.  2020 డిసెంబర్ 3న ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి, పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ ప్రకటన చేసిన కొద్ది వారాలకే, తన ఆరోగ్య సమస్యలు, కరోనా మహమ్మారి ముప్పును దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రవేశం ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా టీవీకే నేత చేసిన ఆరోపణలతో ఈ అంశం మరోసారి తెరపైకి రాగా, తన నిర్ణయాలన్నీ స్వతంత్రంగా తీసుకున్నవేనని రజనీకాంత్ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.


More Telugu News