ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. భారీగా ప్రత్యేక సర్వీసులు

  • యూరప్, ఉత్తర అమెరికాకు అదనపు విమానాలు నడపనున్న ఎయిరిండియా
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ప్రయాణ డిమాండ్
  • ఈ నెల‌ 19- 28 మధ్య 36 ప్రత్యేక సర్వీసుల ఏర్పాటు
  • 10,000కు పైగా అదనపు సీట్లను అందుబాటులోకి తెచ్చిన సంస్థ
  • ఇండిగో కూడా పశ్చిమాసియాకు విమానాలను పెంచినట్లు ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యూరప్, ఉత్తర అమెరికాకు అదనపు విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కీలక మార్గాల్లో వేల సంఖ్యలో అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

వివరాల్లోకి వెళితే... ఈ నెల‌ 19 నుంచి 28 మధ్య ఢిల్లీ, ముంబైల నుంచి లండన్ (హీత్రూ), టొరంటో, ఫ్రాంక్‌ఫర్ట్, జ్యూరిచ్ వంటి ప్రధాన నగరాలకు 36 అదనపు విమానాలను ఆపరేట్ చేయనుంది. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా దాదాపు 10,000కు పైగా సీట్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ నెల‌ 10 నుంచి 18 వరకు 78 అదనపు సర్వీసులను నడిపినట్లు ఎయిరిండియా గుర్తుచేసింది.

ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని విమానయాన మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ గగనతలాన్ని మూసివేయడంతో విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా సుదూర విమానాల సిబ్బంది విధివిధానాల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాత్కాలికంగా కొన్ని సడలింపులు ఇచ్చింది.

మరోవైపు ఇండిగో సంస్థ కూడా ఈ నెల‌ 16 నుంచి 28 మధ్య పశ్చిమాసియాకు 252 వీక్లీ విమానాలు నడుపుతున్నట్లు గత వారం ప్రకటించింది. అయితే దోహా, కువైట్, బహ్రెయిన్ వంటి కొన్ని గల్ఫ్ దేశాలకు మాత్రం సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అదనపు విమానాలకు సంబంధించిన బుకింగ్‌లను తమ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

Air India
Air India flights
Europe flights
North America flights
International flights
Flight services
IndiGo
DGCA
West Asia

More Telugu News