దివంగత శ్రేదేవి ఆస్తి వివాదం.. కోర్టుకు బోనీ కపూర్, జాన్వీ కపూర్
దివంగత సినీ నటి శ్రీదేవికి చెందిన ఆస్తి వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. చెంగల్పట్టులోని 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం కొందరు వ్యక్తులు వేసిన దావాను సవాలు చేస్తూ ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ జాయింట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన జస్టిస్ టి.వి. తమిళ్‌సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం, మార్చి 26 వరకు తదుపరి చర్యలపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది.
అసలు వివాదం ఏమిటంటే.. 1988లో ఈస్ట్ కోస్ట్ రోడ్ సమీపంలోని ఈ ఆస్తిని శ్రీదేవి అన్ని చట్టబద్ధమైన పత్రాలను సరిచూసుకుని మరీ కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలానికి తామే అసలైన వారసులమంటూ మొదలియార్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు సివిల్ దావా వేశారు. ఈ వివాదం ప్రస్తుతం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో కొనసాగుతోంది. కాలం గడిచిపోతున్నా ఈ కోర్టులో ఈ వివాదానికి తెర పడలేదు.
ఈ క్రమంలో, తమ వద్ద అన్ని ఆధారాలు సక్రమంగా ఉన్నాయని, ఈ అక్రమ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ వేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 26న జరగనుంది.