రూ.14 కోట్ల ఆటగాడికి ధోనీ సలహా... క్రికెట్ గురించి కాదు!

ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ.14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌కు ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక వినూత్నమైన సలహా ఇచ్చారు. తొలిసారి ధోనీని కలిసినప్పుడు ఆయన క్రికెట్ గురించి కాకుండా డబ్బు పొదుపు చేసుకోవడంపై మాట్లాడారని ప్రశాంత్ వీర్ స్వయంగా వెల్లడించాడు.

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ వీర్ ఈ విషయాన్ని తెలిపాడు. "మేమింకా క్రికెట్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. ఆయన నాతో మాట్లాడుతూ, వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోమని చెప్పారు" అని ప్రశాంత్ వీర్ వివరించాడు. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తీవ్రమైన పోటీ తర్వాత సీఎస్‌కే అతడిని దక్కించుకుంది.

ఇదిలా ఉంటే... సీఎస్‌కేలో కొత్తగా చేరిన మరో ఆటగాడు సంజూ శాంసన్ కూడా ధోనీ నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. చాలాకాలం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శాంసన్, ఈసారి సీఎస్‌కే తరఫున బరిలోకి దిగుతున్నాడు. "మహీ భాయ్‌తో ఫోన్‌లో మాట్లాడాను. కానీ, ఒకే జట్టులో ఆయనతో కలిసి ఆడటం గొప్ప అవకాశం. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలని ఉంది" అని శాంసన్ పేర్కొన్నాడు.

ఈ నెల‌ 30న గువాహ‌టిలో తన మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్ గురించి శాంసన్ మాట్లాడాడు. రాజస్థాన్‌కు వ్యతిరేకంగా ఆడటం ఇదే తొలిసారని, అయితే మైదానంలో భావోద్వేగాలకు తావివ్వనని స్పష్టం చేశాడు. జట్టులో తన సమయం ముగిసిందని భావించే రాజస్థాన్‌ను వీడినట్లు, ఇప్పుడు సీఎస్‌కే తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని శాంసన్ చెప్పాడు.


More Telugu News