వెనిజువెలా ఇక అమెరికా రాష్ట్రమా?.. ట్రంప్ 'స్టేట్‌హుడ్' పోస్ట్‌తో ప్రకంపనలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను మరోసారి చాటుకున్నారు. "వెనిజువెలా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరవచ్చా? స్టేట్‌హుడ్.. ఎవరికైనా కావాలా?" అంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో కెనడాను 51వ రాష్ట్రంగా పిలిచిన ట్రంప్, గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించారు. కానీ, ఒక దేశం గురించి నేరుగా 'స్టేట్‌హుడ్' అనే పదాన్ని వాడటం ఇదే మొదటిసారి.

జనవరి 2026లో అమెరికా జరిపిన మెరుపు దాడిలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించారు. అప్పటి నుంచి వెనిజువెలాను "మేమే నడుపుతాం" అని ట్రంప్ ప్రకటిస్తూ వస్తున్నారు. వెనిజువెలాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను అమెరికా కంపెనీలు స్వాధీనం చేసుకుంటాయని, ఆ దేశ మౌలిక సదుపాయాలను బాగు చేస్తామని ఆయన చెబుతున్నారు.

ఇటీవల ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఏఐ (AI) ద్వారా రూపొందించిన కొన్ని మ్యాప్‌లను షేర్ చేశారు. వాటిలో కెనడా, వెనిజువెలా, గ్రీన్‌లాండ్.. అమెరికా జెండా కింద ఉన్నట్లు చూపించారు. "గ్రీన్‌లాండ్: అమెరికా టెరిటరీ - 2026లో స్థాపించబడింది" అనే క్యాప్షన్ ఇవ్వడం ద్వారా తన ఉద్దేశాలను స్పష్టం చేశారు.

ట్రంప్ చర్యలపై కెనడా, డెన్మార్క్ (గ్రీన్‌లాండ్ మాతృదేశం) ఇప్పటికే తీవ్రంగా స్పందించాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ "ఇది కేవలం ట్రంప్ ఊహ మాత్రమే, వాస్తవం కాదు" అని కొట్టిపారేశారు. మరోవైపు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్.. "వెనిజువెలా ఏ సామ్రాజ్యానికీ కాలనీ కాదు" అంటూ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. 


More Telugu News