ప్రజలను పార్టీలుగా చూడొద్దు: ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ఫైర్

  • పథకాలు కార్యకర్తలకే ఇస్తున్నారని షర్మిల విమర్శ
  • వైఎస్సార్ పాలనలో అందరికీ పథకాలు అందేవని వెల్లడి
  • శ్రీకాకుళంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీ రూ.400కి పెంచుతామని హామీ
గత వైసీపీ ప్రభుత్వంపైనా, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపైనా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలను ప్రజలుగా చూడాలి తప్ప, వారికి పార్టీ రంగు పులమడం తగదని అన్నారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్.. కొత్తగా ఈ పథకం పేరును 'వీబీ జి రామ్ జి'గా మార్చిన సంగతి విదితమే) పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీలు, కులమతాలకు అతీతంగా అందరికీ పథకాలు అందేవని గుర్తుచేశారు. కానీ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ పథకం వైఎస్సార్ హయాంలో తమ జీవితాల్లో వెలుగులు నింపిందని, కానీ కేంద్రంలో బీజేపీ వచ్చాక పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన షర్మిల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. పని దినాలను 150 రోజులకు, రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచుతామని స్పష్టం చేశారు. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని, ప్రజల్లో మార్పు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

YS Sharmila
Andhra Pradesh Congress
AP Politics
TDP Government
YSRCP Government
MGNREGS
Employment Guarantee Scheme
Srikakulam
Chandrababu Naidu
YS Rajasekhara Reddy

More Telugu News