మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఎన్నో ఏళ్ల ప్రేమాయణం తర్వాత ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా రష్మిక తమ హల్దీ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలలో కొత్త జంట పసుపు, రంగులతో తడిసి ముద్దవుతూ ఎంతో ఆనందంగా కనిపించారు.

ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. ఈ క్రమంలో రష్మిక పంచుకున్న హల్దీ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలకు ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. 

“మా హల్దీ రోజు నిజానికి హల్దీ ప్లస్ హోలీలా మారిపోయింది. మేమంతా రంగులతో తడిసిపోయాం. ఇప్పటికీ నా జుట్టులో కొంచెం ఎరుపు రంగు ఉంది. ఆ రోజు జరిగిన ఆటలన్నింటిలో నా టీమ్ బ్రైడ్ అద్భుతంగా సపోర్ట్ చేయడంతో నేనే గెలిచాను. విజ్జూ (విజయ్ దేవరకొండ) కూడా నా టీమ్‌లోనే ఉన్నాడు” అని సరదాగా రాసుకొచ్చారు.

అలాగే తమ పెళ్లి జరిగిన వేదిక గురించి కూడా రష్మిక ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ వాతావరణం, సిబ్బంది సేవలు, ఆహారం అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తమ వివాహ వేడుకను డిజైనర్ అనామిక అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. “మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడు మాత్రమే మొదలైంది” అంటూ ఆమె కాస్త భావోద్వేగంగా పోస్ట్ ముగించారు.

తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో మెప్పించిన ఈ జంట, ప్రస్తుతం ‘రణబాలి’ అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


More Telugu News