పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్

అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు దుర్మార్గమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. భవిష్యత్ తరాలకు పొట్టిశ్రీరాములు త్యాగనిరతి స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇది ఎన్నికల హామీని నిలబెట్టుకోవడమేనని స్పష్టం చేశారు. దోపిడీ, లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఎవరికీ సాయం చేయకూడదనే డీఎన్ఏ జగన్‌ది కాబట్టే, కన్నతల్లిని, చెల్లిని కూడా మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అడ్డగోలుగా అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి విమర్శించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని తాము అధికారంలోకి వచ్చాక ఐసీయూలోకి తీసుకొచ్చామని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో సౌకర్యవంతమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని నిమ్మల రామానాయుడు వివరించారు.


More Telugu News