బాలా మావయ్య జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం: నారా లోకేశ్

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మేళాకు అద్భుతమైన స్పందన లభించింది. దీనిపై ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.

"హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి దిశానిర్దేశంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో బాలా మావయ్య ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో టీసీఎస్, హెక్సావేర్, బ్లూస్ప్రింగ్, సీఈఐఎల్, టీహెచ్ఎస్ సీ వంటి 110 ప్రఖ్యాత సంస్థలు పాల్గొన్నాయి. జాబ్ మేళాకు 5323 మంది హాజరు కాగా, 1903 మంది ఉద్యోగాలకు, మరో 868 మంది తదుపరి దశ ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారు. వేలాది మంది యువతకు ఉద్యోగ- ఉపాధి అవకాశాలు చూపించిన బాలా మామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెగా జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలు, నిర్వహణలో పాలుపంచుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ ధన్యవాదాలు" అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.




More Telugu News