చేతి వేళ్లు చూపిస్తూ... తన మరణ వదంతులను కొట్టిపారేసిన నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన మరణంపై వ్యాపిస్తున్న వదంతులను స్వయంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఓ కొత్త వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన తన చేతిని చూపిస్తూ, "నాకు ఐదు వేళ్లే ఉన్నాయి" అని చెప్పి, ఇటీవలి వీడియోలో ఆరు వేళ్లు ఉన్నాయన్న ప్రచారాన్ని కూడా సరదాగా కొట్టిపారేశారు.

ఓ కాఫీ షాపులో కాఫీ ఆర్డర్ చేస్తూ కనిపించిన నెతన్యాహు, తన మరణవార్తలపై వ్యంగ్యంగా స్పందించారు. "తనకేమీ కాలేదని, ప్రాణాలు పోయినా తన దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ ప్రజల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.

ఇటీవల ఇరాన్ జరిపిన దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరిగింది. దీనిపై ఆయన కార్యాలయం గతంలోనే స్పందించి, అవన్నీ అసత్యాలని, ప్రధాని క్షేమంగా ఉన్నారని ప్రకటించింది. ఇప్పుడు నెతన్యాహు స్వయంగా వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు.

మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధానిని వెంటాడి అంతమొందిస్తామని ఇరాన్ మిలిటరీ ఆదివారం హెచ్చరించింది. చిన్నారుల మృతికి కారణమైన నెతన్యాహును వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వదంతులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆరోగ్యం, భద్రతపై వస్తున్న ఊహాగానాలకు నెతన్యాహు ఈ వీడియోతో ముగింపు పలికినట్లయింది.


More Telugu News