ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సమీపంలో పెద్దపులి కలకలం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత 16 రోజులుగా సంచరిస్తున్న పులి, ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సమీపానికి చేరడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో అటవీ, పోలీసు, దేవస్థానం అధికారులు అప్రమత్తమై భక్తులకు, స్థానిక గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు.

శంఖవరం, ఊరకొండ ప్రాంతాల నుంచి కత్తిపూడి మార్గం దాటిన పులి, మండపం గ్రామం పొలాల మీదుగా అన్నవరం పంపా రిజర్వాయర్ మార్గంలోకి ప్రవేశించిందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నవరం, తాళ్లపాలెం, మండపం, బెండపూడి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే ఇళ్లకు తిరిగి రావాలని సూచించారు.

అన్నవరం వచ్చే భక్తులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గంలో ఒంటరిగా ప్రయాణించవద్దని, వాహనాలను ఎక్కడా నిలపవద్దని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో వసతి గదుల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు.

పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కాకినాడ జిల్లా డీఎఫ్‌వో ఎన్. రామచంద్రరావు నేతృత్వంలో సుమారు 100 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ట్రాకింగ్ బృందాలు, డార్టింగ్ సిబ్బంది పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారని, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శ్రీకంఠనాథ రెడ్డి ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి సంచారం నేపథ్యంలో ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News