సన్‌రైజర్స్‌కు షాక్.. 'ది హండ్రెడ్' నుంచి పాక్ స్పిన్నర్ అవుట్?

బ్రిటన్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్' (The Hundred) టోర్నీలో సన్‌రైజర్స్ జట్టుకు ఊహించని చిక్కులు వచ్చి పడ్డాయి. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఈ ఫ్రాంచైజీ భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో అతడు బరిలోకి దిగడంపై సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్‌లో 'సన్‌రైజర్స్ హైదరాబాద్' (SRH), దక్షిణాఫ్రికా లీగ్‌లో 'సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్' జట్లను నడుపుతున్న యాజమాన్యమే ఈ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తోంది.

లండన్‌లో ఆదివారం జరిగిన వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఏకంగా 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే, భారతీయ మూలాలున్న సన్‌రైజర్స్ యాజమాన్యం ఒక పాకిస్థాన్ ఆటగాడిని ఇంత భారీ ధరకు కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు జట్టులో కొనసాగుతాడా లేదా అన్న చర్చ మొదలైంది.

అబ్రార్ ఎంపికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఒకవేళ నిరసనలు తీవ్రమైతే, టోర్నీ ప్రారంభానికి ముందే అతడిని తప్పించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గానీ, ఇటు సన్‌రైజర్స్ యాజమాన్యం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.


More Telugu News