పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు సహకరిస్తూ ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఫాక్స్ న్యూస్ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి ఇరాన్‌కు కొంతమేర మద్దతు అందుతోందని అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ట్రంప్ ఏమన్నారంటే.. 
‘‘రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మేము సాయం చేస్తున్నామని పుతిన్ భావిస్తున్నారు. దానికి ప్రతిగా ఆయన ఇరాన్‌కు సాయం చేస్తూ ఉండవచ్చు’’ అని అన్నారు. ప్రపంచ శక్తుల మధ్య ఇదొక సాధారణ ధోరణిగా మారిందని, తాము ఒక పక్షానికి సాయం చేస్తే చైనా లేదా రష్యా మరో పక్షానికి మద్దతు ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్‌కు తాము అండగా ఉన్న విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

వచ్చే వారం ఇరాన్ పై తీవ్ర దాడులు
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 14వ రోజుకు చేరుకున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల పుతిన్‌తో మాట్లాడినప్పుడు తాము ఇరాన్‌తో ఎలాంటి నిఘా సమాచారాన్ని పంచుకోవడం లేదని రష్యా అధికారులు స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం వారిని పూర్తిగా నమ్మడం లేదు. మరోవైపు, వచ్చే వారం తాము ఇరాన్‌పై మరింత తీవ్రస్థాయిలో దాడులు చేయబోతున్నామని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై, హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News