కేకేఆర్‌లోకి జింబాబ్వే పేసర్.. ముస్తాఫిజూర్ స్థానంలో కొత్త ఆటగాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ జట్టులో కీలక మార్పు చేసింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసి, అతడి స్థానంలో జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీతో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 17న ముజారబానీ కోల్‌కతాలోని జట్టు క్యాంపులో చేరనున్నాడు.

6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ఈ జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన ఎత్తుకు తగ్గట్టే బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సిద్ధహస్తుడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఐపీఎల్ అవకాశం కోసం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి కూడా వైదొలిగాడు. గత సీజన్‌లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరిగిన దాడుల నేపథ్యంలో చెలరేగిన వివాదం కారణంగా బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ యాజమాన్యం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. డిసెంబర్ మినీ వేలంలో కేకేఆర్ అతడిని రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక బంగ్లాదేశ్ ఆటగాడికి లభించిన అత్యధిక ధర కావడం గమనార్హం.

ముస్తాఫిజుర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ముజారబానీ, తన ప్రస్తుత ఫామ్, ఉపఖండ పిచ్‌లపై అనుభవంతో మూడుసార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూర్చగలడని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో పేర్కొంది.


More Telugu News