పాక్ ప్లేయర్‌ను ఎందుకు కొనాల్సి వచ్చింది?.. అసలు విషయం చెప్పిన సన్‌రైజర్స్ హెడ్ కోచ్ వెటోరీ

  • 'ది హండ్రెడ్' లీగ్‌లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్
  • రూ.2.34 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్
  • తీవ్ర విమర్శల నేపథ్యంలో వివరణ ఇచ్చిన యాజమాన్యం
  • ఇది కేవలం క్రికెట్ పరమైన నిర్ణయమన్న హెడ్ కోచ్ వెటోరీ
ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' లీగ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడంపై చెలరేగిన వివాదంపై ఆ జట్టు యాజమాన్యం స్పందించింది. ఇది కేవలం క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయమేనని, ఆటగాడి సామర్థ్యాన్ని చూసే ఎంపిక చేశామని స్పష్టం చేసింది. వేలంలో పాక్ ఆటగాళ్ల ఎంపికను నివారించాలని తమకు ఎలాంటి అధికారిక సూచనలు అందలేదని పేర్కొంది.

ఈ విషయంపై సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్‌కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరీ మాట్లాడుతూ.. "అబ్రార్ అహ్మద్ ఒక వైవిధ్యమైన స్పిన్నర్. చాలా మంది దేశీయ ఆటగాళ్లు అతని బౌలింగ్‌ను ఎదుర్కొని ఉండరు. పాక్ ఆటగాళ్లపై వస్తున్న ఊహాగానాల గురించి మాకు తెలుసు. కానీ, వారిని తీసుకోకూడదని మాకు ప్రత్యేక ఆదేశాలేవీ లేవు. మా జట్టుకు ప్రభావవంతమైన స్పిన్నర్ అవసరం కాబట్టే అబ్రార్‌ను ఎంచుకున్నాం" అని స్పష్టతనిచ్చాడు.

లండన్‌లో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు, అబ్రార్ అహ్మద్‌ను 190,000 పౌండ్లకు (సుమారు రూ.2.34 కోట్లు) కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ ఈ వేలంలో పాల్గొనగా, పాక్ ఆటగాడిని కొనడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే, జాతీయత ఆధారంగా ఆటగాళ్లను వేలం నుంచి తప్పించడం చట్టవిరుద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఫ్రాంచైజీలను ముందుగానే హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భారత యాజమాన్యంలోని జట్లు పాక్ ఆటగాళ్లను తీసుకోకూడదనే అనధికారిక నియమాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అబ్రార్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతను గత 38 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 52 వికెట్లు పడగొట్టి స‌త్తా చాటాడు.


More Telugu News