ఇన్‌స్టాగ్రామ్ ప్రేమాయణం.. బాలుడి కిడ్నాప్: సూరత్ స్టేషన్‌లో యువతి అరెస్ట్!

  • ఏడాదిన్నరగా సోషల్ మీడియాలో కొనసాగిన పరిచయం
  • పెళ్లి నిశ్చయం కావడంతో ప్రియుడితో యువతి పరార్
  • బాలుడి అదృశ్యంపై రాజకోట్‌లో కిడ్నాప్ కేసు నమోదు
  • సూరత్ రైల్వే స్టేషన్‌లో దొరికిపోయిన జంట
సోషల్ మీడియాలో మొదలైన ఒక పరిచయం చివరికి పోలీసు స్టేషన్ మెట్లెక్కించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలుడిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువతిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన మోన (పేరు మార్చాం), గుజరాత్‌లోని రాజకోట్ జిల్లా వీర్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు రాజ్‌ (పేరు మార్చాం) ఏడాదిన్నరగా ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్‌లో ఉన్నారు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకరి గురించి ఒకరు వ్యక్తిగత వివరాలు పంచుకోవడమే కాకుండా, కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే, మోన కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో సమస్య మొదలైంది.

పెళ్లి ఇష్టం లేని మోన, మార్చి 6న తన ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా ముంబైకి చేరుకుంది. అక్కడ రాజ్‌ను కలుసుకుంది. ఇద్దరూ కలిసి సూరత్‌కు వచ్చారు. మరోవైపు, తమ కుమారుడు కనిపించడం లేదని రాజ్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రాజకోట్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

సూరత్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద 'షీ టీమ్' పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వెయిటింగ్ రూమ్‌లో ఈ జంట చాలా భయం భయంగా కూర్చోవడం పోలీసుల కంటపడింది. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్‌పై కిడ్నాప్ కేసు ఉన్నట్లు గుర్తించిన సూరత్ రైల్వే పోలీసులు వెంటనే రాజకోట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి వారిద్దరినీ రాజకోట్ పోలీసులకు అప్పగించారు. 


More Telugu News