కావూరి సాంబశివరావు ఆరోగ్యం విషమం
- హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కావూరి
- వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సీనియర్ నేత
- కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆయన కన్నుమూశారనే వార్తలను పలు మీడియా సంస్థలు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ గా వేశాయి. ఈ వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కావూరి కుటుంబ సభ్యులు స్పందించారు.
కావూరి కన్నుమూశారనే వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి పర్యవేక్షిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ఆయన ఇంకా చికిత్స పొందుతున్నారని, దయచేసి అధికారిక సమాచారం వచ్చే వరకు ఇటువంటి వదంతులను ప్రసారం చేయవద్దని విన్నవించారు.
కావూరి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం:
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కావూరి సాంబశివరావు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1984, 1989, 1998లలో మచిలీపట్నం నుంచి... 2004, 2009లలో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు దూరమై బీజేపీలో చేరినప్పటికీ, గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.