Bhumana Karunakar Reddy: అమరావతిలో టీటీడీ ఆలయం కోసం రూ. 12.5 కోట్లు పెట్టి భూమి కొనడం ఏమిటి?: భూమన
- అమరావతి వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణం
- సాధారణంగా ఆలయాల నిర్మాణానికి భక్తులు లేదా సంస్థలు ఉచితంగా భూములు ఇస్తారన్న భూమన
- భక్తుల సొమ్మును టీటీడీ దుర్వినియోగం చేసిందని విమర్శ
ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ప్రస్తుత పాలకమండలిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలోని వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి టీటీడీ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు.
శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని భూమన ఆరోపించారు. సాధారణంగా దేవుడి ఆలయాల నిర్మాణానికి భక్తులు లేదా సంస్థలు ఉచితంగా భూములు ఇస్తాయని, కానీ అమరావతిలో టీటీడీ ఆలయం కోసం రూ. 12.5 కోట్లు వెచ్చించి భూమిని కొనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ ఆలయాల కోసం భూమిని కొనుగోలు చేసిన దాఖలాలు లేవని, ఇది భక్తుల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు. వివిధ ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, దేవుడికి మాత్రం భూమిని అమ్ముతోందని విమర్శించారు. టీటీడీ చెల్లించిన రూ. 12.5 కోట్ల సొమ్మును సీఆర్డీఏ వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపైనా భూమన స్పందించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండటం సరికాదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల తిరుమలలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటం వంటి ఘటనలు స్వామివారు ఆగ్రహించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.