అవన్నీ పుకార్లే.. ఉద్యోగాల కోతపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన

  • భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తలను ఖండించిన టెక్ మహీంద్రా
  • 30,000 మందిని తీసివేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు
  • ఉద్యోగాల కోతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • లేఆఫ్స్ ఉండవని.. ఉత్పాదకతపైనే దృష్టి పెట్టామని వెల్లడి
ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తమ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఉండబోతోందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. 30,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళిక ఏదీ పరిశీలనలో లేదని సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు అధికారికంగా సమాచారం అందించింది.

సోషల్ మీడియాలో ముఖ్యంగా 'ఎక్స్' వంటి ప్లాట్‌ఫామ్‌లలో తమ కంపెనీలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వస్తున్న పుకార్లను గమనించామని టెక్ మహీంద్రా తెలిపింది. ఈ ఊహాగానాల నేపథ్యంలో మార్కెట్‌కు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని భావించి ఈ ప్రకటన చేస్తున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్ప‌ష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా టెక్ మహీంద్రాలో సుమారు 1,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత త్రైమాసికంలో కూడా కంపెనీ ఇలాంటి ప్రకటననే చేసింది. సామూహిక తొలగింపుల ఆలోచన లేదని, అయితే ఉత్పాదకతను పెంచే చర్యలపై దృష్టి సారిస్తున్నామని తెలిపింది. ఉద్యోగులను ఒక ప్రాజెక్ట్ నుంచి మరో కొత్త ప్రాజెక్ట్‌కు మార్చడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు అప్పట్లో వెల్లడించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న తరుణంలో టెక్ పరిశ్రమలో ఉద్యోగాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే అమెజాన్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేలాది ఉద్యోగాలకు కోత పెట్టాయి. అయితే, టెక్ మహీంద్రా తాజా ప్రకటనతో ప్రస్తుతానికి ఆ సంస్థ ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది.


More Telugu News