Iran: ఇళ్లలోంచి బయటికి రావొద్దు... ఇరాన్ ప్రజలకు అమెరికా హెచ్చరిక

Iran US warns Iranian people to stay indoors
  • జనావాసాల మధ్య నుంచే క్షిపణుల ప్రయోగిస్తున్న ఇరాన్ సైన్యం
  • ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఇరాన్ పౌరులకు అమెరికా సూచన
  • పౌరులను ఇరాన్ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపణ
  • ఇప్పటికే స్వదేశానికి చేరిన 32 వేల మంది అమెరికన్లు
  • సైనిక చర్యలు జరిగే చోట భద్రతకు గ్యారంటీ లేదన్న అమెరికా
ఇరాన్ పౌరులకు అమెరికా సైన్యం ఆదివారం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ సైన్యం జనావాసాల మధ్య నుంచే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఈ వ్యూహం వల్ల లక్షలాది మంది సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, దాడులు తీవ్రమవుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) ప్రకారం.. ఇరాన్ మిలటరీ డెజ్ ఫుల్, ఇస్ఫహాన్, షిరాజ్ వంటి రద్దీగా ఉండే నగరాల నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇలాంటి ప్రాంతాలను సైనిక అవసరాలకు వాడటం వల్ల అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవి రక్షణ హోదాను కోల్పోతాయని, ప్రతీకార దాడులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమాయక ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందని సెంట్ కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఆరోపించారు. ఇరాన్ తమ పొరుగు దేశాల్లోని పౌర విమానాశ్రయాలు, హోటళ్లపై కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తోందన్నారు.

తాము పౌరులకు హాని కలగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అయితే ఇరాన్ సైనిక స్థావరాలుగా వాడుకుంటున్న ప్రాంతాల్లో భద్రతకు గ్యారంటీ ఇవ్వలేమని అమెరికా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించినప్పటికీ, తమ ప్రతిఘటనతో ఆ వేగం తగ్గిందని పేర్కొంది.

మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్లను సురక్షితంగా తరలించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు 32,000 మందికి పైగా అమెరికన్లు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని అసిస్టెంట్ సెక్రటరీ డైలాన్ జాన్సన్ తెలిపారు. ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Iran
Iran military
United States
US Central Command
Middle East
ballistic missiles
Drones
civilian safety
Oman
Kuwait

More Telugu News