జేడీయూలో అధికారికంగా చేరిన నితీశ్ కుమార్ తనయుడు

  • పాట్నాలోని పార్టీ కార్యాలయంలో నిశాంత్ కుమార్ ను ఘనంగా ఆహ్వానించిన సీనియర్ నేతలు
  • తండ్రి మార్గదర్శకత్వంలోనే బీహార్ అభివృద్ధికి పనిచేస్తానని నిశాంత్ వెల్లడి
  • త్వరలో చంపారన్ నుంచి రాజకీయ పర్యటనలు ప్రారంభించే అవకాశం
బీహార్ రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం పట్నాలోని జేడీయూ కేంద్ర కార్యాలయంలో ఆయన అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కేంద్ర మంత్రి లలన్ సింగ్, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు.

పార్టీలో చేరిన సందర్భంగా సంజయ్ కుమార్ ఝా.. నిశాంత్‌కు పార్టీ టోపీ, జ్ఞాపికను అందించగా, కేంద్ర మంత్రి లలన్ సింగ్ సంప్రదాయ తలపాగా చుట్టి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం సీనియర్ నేతల కాళ్లకు నమస్కరించి నిశాంత్ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ మాట్లాడుతూ... తన తండ్రి మార్గదర్శకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. "ఈరోజు నేను పార్టీలో చేరడానికి వచ్చాను. మా నాన్న రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన నిర్ణయం. ఆయన సూచనల మేరకు బీహార్ కోసం మేం పనిచేస్తాం" అని పేర్కొన్నారు. నితీశ్ కుమార్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళతానని చెప్పారు. కార్యకర్తలు పార్టీపై ఇదే ఉత్సాహం, నమ్మకం కొనసాగించాలని కోరారు.

కాగా, నిశాంత్ కుమార్ త్వరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతారని జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ తెలిపారు. చంపారన్ ప్రాంతం నుంచి ఆయన తన రాజకీయ యాత్రను ప్రారంభించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. గతంలో నితీశ్ కుమార్ కూడా తన రాజకీయ యాత్రలను అక్కడి నుంచే మొదలుపెట్టేవారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత బలోపేతంలో నిశాంత్ కీలక పాత్ర పోషిస్తారని, పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నిర్వహిస్తారని జేడీయూ వర్గాలు భావిస్తున్నాయి.




More Telugu News