అభిషేక్ శర్మకు ఇచ్చిన అవకాశాలు చాలు... బ్రేక్ తప్పనిసరి: కైఫ్

  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముంగిట టీమిండియా కూర్పుపై చర్చ
  • అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలన్న మహ్మద్ కైఫ్
  • గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 80 పరుగులు చేసిన ఓపెనర్
  • అభిషేక్ స్థానంలో రింకూ సింగ్‌ను తీసుకోవాలని సూచన
  • సంజూ శాంసన్‌తో అభిషేక్‌ను పోల్చలేమన్న మాజీ క్రికెటర్
నేడు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ జరగనుండగా, టీమిండియా తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒక స్పష్టమైన సూచన చేశాడు. ఫైనల్ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మకు విశ్రాంతినివ్వాలని, అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్‌ను తీసుకోవాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన కైఫ్, అభిషేక్ శర్మ ప్రదర్శనపై విశ్లేషణ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జింబాబ్వేపై చేసిన హాఫ్ సెంచరీ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. కీలకమైన ఇంగ్లాండ్ సెమీఫైనల్‌లోనూ కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ, ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో మార్పులు చేయడంలో తప్పులేదని కైఫ్ పేర్కొన్నాడు.

"వెస్టిండీస్ జట్టు కూడా బ్రాండన్ కింగ్ స్థానంలో రోస్టన్ చేజ్‌ను తీసుకొని మంచి ఫలితాలు సాధించింది. అలాగే సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం భారత్‌కు కలిసొచ్చింది. అదే తరహాలో అభిషేక్‌కు బ్రేక్ ఇచ్చి రింకూ సింగ్‌ను ఆడిస్తే మంచి ఫలితం ఉంటుంది. రింకూ అన్ని ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తున్నాడు" అని కైఫ్ వివరించాడు. ఒకవేళ రింకూ కాకపోతే, అదనపు బౌలర్ కోసం కుల్దీప్ యాదవ్ లేదా సిరాజ్‌ను పరిశీలించవచ్చని సూచించాడు.

ఇదే సమయంలో సంజూ శాంసన్‌తో అభిషేక్‌ను పోల్చడం సరికాదని కైఫ్ అన్నాడు. సంజూకి 11 ఏళ్ల అనుభవం ఉందని, ఐపీఎల్‌లో టాప్ రికార్డులు ఉన్నాయని గుర్తు చేశాడు. అభిషేక్ శర్మ ఐసీసీ ఈవెంట్లకు ఇంకా కొత్తని, అతడు నేర్చుకునే దశలో ఉన్నాడని కైఫ్ స్పష్టం చేశాడు.


More Telugu News