ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్

  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గను ఏ-2గా చేర్చిన సిట్‌ అధికారులు
  • సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టులో ఛార్జిషీట్‌
  • కోర్టు ఆదేశాలతో లక్ష్మీ దుర్గ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు సిట్‌ అధికారులు ఈ కేసులో దర్యాప్తును లోతుగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను ఈ కేసులో రెండవ నిందితురాలిగా (ఏ-2) చేర్చారు. ఈ మేరకు సిట్‌ అధికారులు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

పోలీసులు సమర్పించిన ఛార్జిషీట్‌ను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. లక్ష్మీ దుర్గపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం లక్ష్మీ దుర్గ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


More Telugu News