అమెరికా దాడిలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోవడంపై జైశంకర్ స్పందన

  • మిలన్-2026 విన్యాసాల్లో మూడు ఇరాన్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయన్న జైశంకర్
  • మార్చి 1న ఇరాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు కొచ్చి పోర్టులో వాటికి డాకింగ్ అనుమతి ఇచ్చినట్టు వెల్లడి
  • మార్చి 4న శ్రీలంక సమీపంలో ఒక నౌకపై అమెరికా దాడి చేసిందన్న జైశంకర్

ఢిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ 2026 వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హిందూ మహాసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ నౌకలకు భారత్ ఇచ్చిన అనుమతులపై కీలక వివరణ ఇచ్చారు. శ్రీలంక తీరంలో అమెరికా సబ్‌మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోయిన కొన్ని రోజులకే ఈ వ్యాఖ్యలు రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


జైశంకర్ వివరించిన ప్రధానాంశాలు ఇవే:

హిందూ మహాసముద్రంలో మూడు ఇరాన్ నౌకలు (ఐరిస్ దేనా, ఐరిస్ లావన్, ఐరిస్ బుషెహర్) ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2026 (మిలన్ 2026) విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే, మార్చి మొదటి వారంలో అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముదరడంతో ఈ నౌకలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మార్చి 1న ఇరాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు, మానవీయ కోణంలో ఆలోచించి వాటికి కొచ్చి పోర్టులో డాకింగ్ అనుమతి ఇచ్చినట్లు జైశంకర్ తెలిపారు. ఆ నౌకల్లో యువ క్యాడెట్లు ఉన్నారని, వారు అనుకోని పరిస్థితుల్లో ఈ పరిణామాల మధ్య చిక్కుకున్నారని ఆయన పేర్కొన్నారు.


శ్రీలంక తీరానికి సమీపంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. మార్చి 4న అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఇరాన్ ఫ్రిగేట్ 'ఐరిస్ దేనా'పై అమెరికా సబ్‌మెరైన్ టార్పెడోతో దాడి చేయడంతో అది మునిగిపోయిందని గుర్తుచేశారు. భారత్ చట్టపరమైన అంశాల కంటే మానవత్వానికే పెద్దపీట వేసిందని, తాము తీసుకున్నది సరైన నిర్ణయమని జైశంకర్ స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రంలో విదేశీ సైనిక స్థావరాల ఉనికి అనేది వాస్తవమని, ఈ నేపథ్యంలో భారత్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.



More Telugu News