Ram Rahim: జర్నలిస్ట్ హత్య కేసు.. 'డేరా' రామ్ రహీమ్‌ను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

Ram Rahim acquitted in journalist murder case
  • జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబా రామ్ రహీమ్‌కు ఊరట
  • ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసిన హైకోర్టు
  • అయితే రేప్ కేసులో శిక్ష కారణంగా జైల్లోనే కొనసాగింపు
  • ఇదే కేసులో మరో ఇద్దరు నిందితుల అప్పీళ్లను తిరస్కరించిన కోర్టు
సిర్సా కేంద్రంగా పనిచేసే డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టులో భారీ ఊరట లభించింది. సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. అయితే, ఈ కేసులో నిర్దోషిగా తేలినప్పటికీ రామ్ రహీమ్ జైలు నుంచి విడుదల కావడం లేదు. ఆయన మరో అత్యాచారం కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్నందున జైల్లోనే కొనసాగనున్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, జస్టిస్ విక్రమ్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. రామ్ రహీమ్ దాఖలు చేసుకున్న అప్పీల్‌ను ప‌రిశీలించిన‌ కోర్టు, ఇదే కేసులో దోషులుగా ఉన్న మరో ఇద్దరి అప్పీళ్లను మాత్రం తోసిపుచ్చింది. వారి శిక్షను ధర్మాసనం ఖరారు చేసింది. దాదాపు ఏడేళ్ల క్రితం ఇదే కేసులో రామ్ రహీమ్‌కు జీవిత ఖైదు పడింది.

జర్నలిస్ట్ ఛత్రపతి హత్య జరిగిన 16 ఏళ్ల తర్వాత 2019లో ప్రత్యేక కోర్టు రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ముఖ్యంగా హత్యకు ఉపయోగించినట్లు చెబుతున్న బుల్లెట్లపై నెలకొన్న వివాదాన్ని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ తీర్పును వెలువరించింది.

2017లో వెలుగులోకి వచ్చిన రేప్ కేసులో దోషిగా తేలడంతో రామ్ రహీమ్ అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షాకాలంలో ఆయనకు ఇప్పటివరకు 14 సార్లు తాత్కాలిక విడుదల (పెరోల్) లభించడం గమనార్హం. చాలాసార్లు ఆయన యూపీలోని బాగ్‌పత్ జిల్లాలో ఉన్న డేరా ఆశ్రమంలోనే గడిపారు. సిర్సా కేంద్రంగా పనిచేసే డేరా సచ్చా సౌదాకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. ముఖ్యంగా హర్యానాలోని పలు జిల్లాల్లో ఈ సంస్థకు రాజకీయంగా సామాజికంగా బలమైన పట్టు ఉంది.
Ram Rahim
Ram Rahim Singh
Ram Chander Chhatrapati
journalist murder case
Dera Sacha Sauda
Haryana High Court
rape case
court verdict
Sirsa
Punjab

More Telugu News