ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. టెహ్రాన్ విమానాశ్రయంపై క్షిపణుల వర్షం

  • మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణుల వర్షం
  • దాడిలో పలు విమానాలు దగ్ధం, భారీగా ఎగసిపడిన మంటలు
  • పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత, ముడి చమురు ధరలు పెరిగే అవకాశం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మెరుపు దాడులకు తెగబడింది. నగరంలోని కీలకమైన మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో విమానాశ్రయంలో భారీ ఎత్తున మంటలు చెలరేగి, రన్‌వేపై ఉన్న పలు విమానాలు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో భయానక వాతావరణం నెలకొంది.

ఈ హఠాత్పరిణామంతో టెహ్రాన్ నగరం ఉలిక్కిపడింది. విమానాశ్రయ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇజ్రాయెల్ జెట్‌లను అడ్డుకునేందుకు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయినట్లు తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో విమానాశ్రయం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఇరాన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మెహరాబాద్ విమానాశ్రయం కేవలం పౌర విమాన సర్వీసులకే కాకుండా, ఇరాన్ సైనిక రవాణాకు కూడా కీలక కేంద్రంగా ఉంది. ఇరాన్ వైమానిక సరఫరా మార్గాలను దెబ్బతీయాలనే వ్యూహంతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు గల్ఫ్ తీరంలో అమెరికా నౌకలు మోహరించి ఉండగా, ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ రాజధానిపై దాడి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


More Telugu News