ఆస్కార్ వేదికపై మరోసారి ప్రియాంక .. ప్రజెంటర్‌గా అరుదైన గౌరవం

  • 98వ ఆస్కార్ అవార్డుల వేదికపై మెరవనున్న ప్రియాంక చోప్రా
  • అధికారిక ప్రజెంటర్‌లలో ఒకరిగా ఎంపికైన గ్లోబల్ స్టార్
  • 2016 తర్వాత రెండోసారి అకాడమీ వేదికపై ప్రజెంటర్‌గా పీసీ
  • హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్‌తో కలిసి ప్రజెంటేషన్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే  అకాడమీ (ఆస్కార్) అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 ఈ నెల 16న జరగనున్న 98వ అకాడమి పురస్కారాల వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు రాబర్ట్ డౌనీ జూనియర్, విల్ ఆర్నెట్ వంటి వారితో కలిసి ప్రియాంక వేదికను పంచుకోనున్నారు. ఆమె ఆస్కార్ ప్రజెంటర్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. గతంలో 2016లోనూ ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇటీవల 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటను దీపికా పదుకొణె ప్రపంచ వేదికపై పరిచయం చేయగా, ఇప్పుడు మరోసారి ఓ భారతీయ నటి అకాడమీ వేదికపై మెరవనుండటం విశేషం. 

ఇటీవలే ప్రియాంక కే-పాప్ స్టార్ లీసాతో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా ప్రదానం చేశారు. సినిమాల విషయానికొస్తే, ఆమె నటించిన ‘ది బ్లఫ్‌’ ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంతో ప్రియాంక బిజీగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది ఆస్కార్ బరిలో ‘సిన్నర్స్‌’ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది.


More Telugu News