ఘనంగా అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్.. సచిన్ భావోద్వేగం.. ఇదిగో వీడియో!

Arjun Tendulkar Pre Wedding Celebrations Grand Affair Sachin Emotional
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన స్నేహితురాలు సానియా చందోక్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు అంబానీ కుటుంబం ఆతిథ్యమివ్వడం విశేషం. ఈ వేడుకకు అంబానీ కుటుంబం ప్రత్యేకంగా హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించింది.

టెండూల్కర్, అంబానీ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా బలమైన స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతా అంబానీ, ముఖేశ్‌ అంబానీ, ఆకాశ్-శ్లోకా అంబానీ, అనంత్-రాధికా అంబానీ దంపతులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమం రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ భావోద్వేగంగా ప్రసంగించాడు. అంబానీ కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. "వదిన, ముఖేష్ భాయ్, మా పిల్లల కొత్త ప్రయాణాన్ని ఆశీర్వదించడానికి ఇంతకంటే గొప్ప వేదిక, ఇంతకంటే మంచి మనుషులు ఉండరని నేను భావిస్తున్నాను. మా కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని సచిన్ అన్నాడు.

కొడుకు అర్జున్ ఎదుగుదల గురించి మాట్లాడుతూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు. "ఒక కొడుకు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడే.. వాడు పెద్దవాడయ్యాడని తల్లిదండ్రులకు అర్థమవుతుంది. అర్జున్, సానియా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అర్జున్, నిన్ను నువ్వు ప్రేమించినంతగా ప్రేమించే ఒక ప్రత్యేకమైన అమ్మాయిని నీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను" అంటూ కొడుకు, కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Arjun Tendulkar
Sachin Tendulkar
Sania Chandok
Ambani family
Pre-wedding celebration
Jamnagar
Cricket
Nita Ambani
Mukesh Ambani
Anant Ambani

More Telugu News