భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. చెపాక్‌లో మంచుకు అమెరికా కెమికల్‌తో చెక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే టీమిండియాకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం. సూపర్-8 దశలో భాగంగా ఇవాళ‌ చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సూర్యకుమార్ యాదవ్ సేన.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇకపై జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌లలోనూ తప్పక గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలించాల్సి ఉంటుంది. ఈ దశలో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేదు.

చెన్నైలో ఈ మ్యాచ్ రాత్రిపూట జరగనుండటంతో మంచు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో మంచు కారణంగా బంతి తడిసిపోయి బౌలర్లకు పట్టు చిక్కదు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. దీంతో టాస్ గెలిచిన జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఈ అసమానతను తగ్గించి, ఆటలో ఇరు జట్లకు సమాన అవకాశాలు కల్పించేందుకు చెపాక్ స్టేడియం నిర్వాహకులు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం మంచు ప్రభావాన్ని నిరోధించేందుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ‘డ్యూ క్యూర్’ అనే ప్రత్యేక రసాయనాన్ని ఉపయోగిస్తున్నారు. మ్యాచ్‌కు ముందు మంగళ, బుధవారాల్లో ఇప్పటికే ఈ కెమికల్‌ను మైదానం అంతటా పిచికారీ చేశారు. మ్యాచ్ రోజు మధ్యాహ్నం మరోసారి పిచికారీ చేసి, రాత్రి సమయంలో మంచు ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ్యాచ్ సమయంలో గాలిలో తేమ 80 నుంచి 90 శాతం వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.

సాధారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. కానీ, మంచు కురవడం మొదలైతే పిచ్ స్వరూపమే మారిపోతుంది. బంతి వేగంగా స్కిడ్ అవుతూ బ్యాట్‌పైకి వస్తుంది. దీంతో బౌలర్లకు పట్టు దొరకడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో టాస్ అత్యంత కీలకంగా మారనుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిస్తే, కెప్టెన్లు దాదాపుగా ఛేజింగ్‌కే మొగ్గుచూపుతారు.

సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లలో భారత్, జింబాబ్వే రెండు జట్లూ ఘోర పరాజయాలను చవిచూశాయి. దక్షిణాఫ్రికాతో భారత్ చిత్తుకాగా, వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే 107 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. సెమీస్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి.

Team India
T20 World Cup 2024
India vs Zimbabwe
Chepauk Stadium
Dew Cure
Chennai
MA Chidambaram Stadium
Suryakumar Yadav
T20 World Cup

More Telugu News