టీమిండియా సెమీస్ ఆశలు.. సంక్లిష్టంగా మారిన సమీకరణాలు!

T20 World Cup Semifinal Scenario For India after Loss Against South Africa
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ చేరాలన్న భారత ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ 8 దశలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి.

ఈ ఓటమితో భారత్ సెమీస్ చేరాలంటే, ఇకపై జరగబోయే వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలవడం జట్టుకు అత్యంత కీలకం అయినప్పటికీ, సెమీస్ బెర్త్ గ్యారెంటీగా లభిస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్‌రేట్ (NRR) సమీకరణాలు భారత భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి.

రెండు మ్యాచ్‌లూ గెలిస్తే.. 
ఒకవేళ భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే, ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. సాధారణంగా సెమీస్‌కు ఇది సరిపోతుంది. కానీ, దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి, అదే సమయంలో వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విజేత కూడా దక్షిణాఫ్రికాను ఓడిస్తే, అప్పుడు మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లతో భారత్‌తో సమానంగా నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నెట్ రన్‌రేట్ ఆధారంగానే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.

ఒక్క మ్యాచ్ గెలిస్తే.. 
భారత్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అప్పుడు భారత్ ఖాతాలో 2 పాయింట్లే ఉంటాయి. ఈ సందర్భంలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే, దక్షిణాఫ్రికా తన అన్ని మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి. దీంతో పాటు వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విజేతపై భార‌త్ ఆధార‌ప‌డి ఉంటుంది. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ 2 పాయింట్లతో సమంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరి నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటే వారే ముందడుగు వేస్తారు. మొత్తం మీద టీమిండియా సెమీస్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
Go Back to Shorts
T20 World Cup 2026
India
South Africa
Semi-Finals
Net Run Rate
West Indies
Zimbabwe
Cricket
Ahmedabad
Suryakumar Yadav

More Telugu News