Manjurul Islam: లైంగిక వేధింపుల ఆరోపణలు... బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ పై నిషేధం

Manjurul Islam Banned Over Sexual Harassment Allegations
  • వేధింపుల ఆరోపణలతో మాజీ క్రికెటర్ మంజురుల్ ఇస్లాంపై బంగ్లా బోర్డు నిషేధం
  • మాజీ మహిళా కెప్టెన్ జహనారా ఆలం చేసిన ఫిర్యాదుపై విచారణ
  • స్వతంత్ర కమిటీ విచారణలో రెండు ఆరోపణలకు ఆధారాలు లభ్యం
బంగ్లాదేశ్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్ మంజురుల్ ఇస్లాంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, బోర్డు పరిధిలోని ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాలుపంచుకోకుండా అతనిపై నిషేధం విధించింది.
షెర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బంగ్లాదేశ్ మాజీ మహిళా కెప్టెన్ జహనారా ఆలం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన స్వతంత్ర కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు బీసీబీ తెలిపింది. 2022 ప్రపంచ కప్ సమయంలో మంజురుల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని జహనారా ఆరోపించింది.

జహనారా చేసిన నాలుగు ఆరోపణలపై కమిటీ విచారణ జరిపింది. వీటిలో రెండింటికి సరైన ఆధారాలు లభించనప్పటికీ, మిగిలిన రెండింటిలో మంజురుల్ అసభ్యంగా ప్రవర్తించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. గతంలో మహిళల జట్టు సెలెక్టర్‌గా, మేనేజర్‌గా పనిచేసిన మంజురుల్ కాంట్రాక్ట్ 2025 జూన్ 30తో ముగిసింది. అతని ప్రవర్తన వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది వేధింపుల కిందకే వస్తుందని కమిటీ పేర్కొంది.

ఇదే సమావేశంలో, తొలిసారిగా నిర్వహించనున్న మహిళల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూబీపీఎల్) షెడ్యూల్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ టోర్నీ 2026 ఏప్రిల్ 4 నుంచి 14 వరకు ఢాకా, ఛటోగ్రామ్ వేదికలుగా జరగనుంది. అలాగే, జాతీయ సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ గాజీ అష్రాఫ్ హుస్సేన్ పదవీకాలాన్ని మరో నెల పొడిగించారు.





Manjurul Islam
Bangladesh cricket
sexual harassment
Jahanara Alam
BCB
Bangladesh Premier League
cricket ban
Gazee Ashraf Hussain
Bangladesh women's cricket
Sher-e-Bangla Stadium

More Telugu News