Pakistan Hockey Team: ఆస్ట్రేలియా టూర్ లో పాక్ హాకీ జట్టుకు అవమానం
- పేమెంట్స్ చేయకపోవడంతో రిజర్వేషన్ రద్దు చేసిన హోటల్
- నిధులున్నా రోడ్డున పడ్డ ఆటగాళ్లు..
- 5-స్టార్ హోటల్ బదులు ఎయిర్ బిఎన్బీలో బస
- రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టిన పీసీబీ!
పాకిస్థాన్ హాకీ జట్టు ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కనీస సౌకర్యాలు లేక, ఉన్న నిధులు పక్కదారి పట్టడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ గడ్డపై తీవ్ర అవమానాలకు గురయ్యారు. ఆస్ట్రేలియాలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ లో పాల్గొనేందుకు వెళ్లిన పాక్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. హోటల్ బిల్లులు చెల్లించకపోవడంతో యాజమాన్యం వారి రిజర్వేషన్లను రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లు కాన్‌బెర్రా వీధుల్లో పడాల్సి వచ్చింది.
5 స్టార్ హోటళ్లలో బస కోసం పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ (పీఎస్ బీ) సుమారు రూ.కోటి (10 మిలియన్లు) కేటాయించినప్పటికీ, ఆటగాళ్లను మాత్రం ఎయిర్ బిఎన్బీ గదుల్లో ఉంచారు. నిధుల కొరత కారణంగా ఆటగాళ్లే స్వయంగా బట్టలు ఉతుక్కుంటూ, పాత్రలు కడుక్కుంటూ గడపాల్సి రావడం గమనార్హం. ఈ వ్యవహారం పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ ఎఫ్) వైఫల్యాన్ని ఎండగట్టింది.కెప్టెన్‌పై వేటు.. ఉపసంహరణ
బోర్డు వైఫల్యాలను ఎండగట్టినందుకు పాక్ హాకీ కెప్టెన్ అహ్మద్ షకీల్ బట్ పై అప్పటి పీహెచ్‌ఎఫ్ ప్రెసిడెంట్ తారిక్ బుగ్తీ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ప్రధాని షెహబాజ్ షరీఫ్ జోక్యంతో బోర్డు ప్రెసిడెంట్ మారడమే కాకుండా, కెప్టెన్‌పై ఉన్న సస్పెన్షన్ అక్రమమని పేర్కొంటూ ప్రభుత్వం దానిని వెంటనే రద్దు చేసింది.
ఆదుకున్న క్రికెట్ బోర్డు
హాకీ జట్టు దీనస్థితిని చూసి పీసీబీ ప్రెసిడెంట్ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ స్పందించారు. ప్రతి క్రీడాకారుడికి రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈజిప్టులో జరగబోయే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ కోసం విమాన టిక్కెట్లు, కిట్లు మరియు మెరుగైన హోటల్ వసతిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గాయపడిన ఆటగాళ్లకు తక్షణమే వైద్య సాయం అందించాలని పీసీబీని ఆయన ఆదేశించారు. ‘‘దేశ గౌరవం అన్నిటికంటే ముఖ్యం. ఏ పరిస్థితిలోనూ మన క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనివ్వం’’ అని మొహసీన్ నఖ్వీ స్పష్టం చేశారు.