బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య

  • మైమెన్ సింగ్ జిల్లాలో నిన్న రాత్రి దారుణ హత్య
  • 62 ఏళ్ల సుషేన్ చంద్రను హత్య చేసిన దుండగులు
  • పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారన్న పోలీసులు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు హిందువులను బంగ్లాదేశ్ లో దారుణంగా హతమార్చారు. ఈ నెల 12న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో... అక్కడ మరో హిందువును హత్య చేశారు. మైమెన్ సింగ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సుషేన్ చంద్ర సర్కార్ (62) అనే వ్యాపారిని ఆయన దుకాణంలోనే హత్య చేశారు. మృతుడు త్రిషల్ సబ్ డిస్ట్రిక్ట్ లోని బోగర్ బజార్ లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఇదే ప్రాంతంలోని సౌత్ కాండ గ్రామంలో నివసిస్తున్నారు.

రాత్రి 11 గంటల సమయంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారని... ఆ సమయంలో సుషేన్ తన దుకాణంలోనే ఉన్నాడని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత హంతకులు షట్టర్ దించి, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారని తెలిపారు. హంతకుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్యను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.



More Telugu News