Elon Musk: చంద్రుడిపై సివిలైజేష‌న్.. వైరల్ అవుతున్న ఎలాన్ మస్క్ పోస్ట్!

ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రతిష్ఠాత్మక లక్ష్యాలతో ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన చంద్రుడిపై మానవ నాగరికత ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. "చంద్రుడిపై సివిలైజేష‌న్" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసి, తన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త చర్చకు తెరలేపారు.

అసలు విషయం ఏంటంటే, 'మూన్ 2042' పేరుతో గ్రోక్ ఏఐ రూపొందించిన ఒక వీడియోను @DogecoinNorway అనే యూజర్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోనే మస్క్ తిరిగి షేర్ చేశారు. ఈ వీడియోలో చంద్రుడి ఉపరితలంపై డోమ్ ఆకారంలో భారీ నిర్మాణాలు, వాటి మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్న వ్యోమగాములు, అత్యాధునిక టెస్లా వాహనాలు కనిపించాయి. అలాగే, ఆస్ట్రోనాట్ సూట్లలో చిన్నారులు ఆడుకుంటున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

అంతకుముందు "అంగారకుడి ప్రాజెక్టు 5 లేదా 6 ఏళ్లలో ప్రారంభమవుతుంది. చంద్రుడి ప్రాజెక్టుతో సమాంతరంగా జరుగుతుంది. కానీ, ప్రాథమికంగా చంద్రుడిపైనే దృష్టి పెడతాం" అని మస్క్ ఎక్స్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి మస్క్ చాలాకాలంగా అంగారకుడిపై మానవ కాలనీని ఏర్పాటు చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెబుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రుడికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వీడియో షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు మస్క్ తన దృష్టిని అంగారకుడి నుంచి చంద్రుడి వైపు మళ్లిస్తున్నారని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు సరదాగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా భూమికి ఆవల మరో గ్రహంపై మానవ నాగరికతను చూడాలనుకునే అంతరిక్ష ప్రియుల్లో మస్క్ తాజా పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది.
Elon Musk
Moon civilization
SpaceX
Mars project
Lunar base
Moon 2042
Grok AI
Tesla
Space exploration
Human colonization

More Telugu News