Chandrababu Naidu: జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu Comments on Jagans Helipad Land
  • హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారన్న చంద్రబాబు
  • చట్టవిరుద్ధంగా భూములు లాక్కోవడం దారుణమని విమర్శ
  • గత పాలకుల దుర్మార్గాల గురించి అందరూ ఆలోచించాలని సూచన
వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటి పక్కన ఉన్న భూమిని హెలిప్యాడ్ కోసం బలవంతంగా లాక్కున్నారని... హెలిప్యాడ్ కోసం భూమిని ఇవ్వకపోతే... దాన్ని 22-Aలో పెట్టారని, బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. చట్టాలు చేయాల్సిన వ్యక్తి, చట్టాలు అమలు చేయాల్సిన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి భూమిని చట్టవిరుద్ధంగా 22-Aలో పెట్టడం దారుణమని అన్నారు. 

ఐదేళ్లు అవుతున్నా ఆయనకు విముక్తి లభించలేదని చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి ఆయన మొన్న అన్ని వివరాలు ఇచ్చారని తెలిపారు. భూములపై గత పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అనే దానిపై అందరూ ఆలోచించుకోవాలని చెప్పారు. 

రెవెన్యూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని సీఎం తెలిపారు. రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను ఇస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో పాసు పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ వివాదాలు లేకుండా సర్వే ప్రక్రియలను పకడ్బందీగా చేపడుతున్నామని చెప్పారు. 

రాజధాని అమరావతిని కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖలో గూగుల్ తో పాటు పలు సంస్థలు డేటా సెంట్లర్లను ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయని చెప్పారు. 
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Andhra Pradesh
Helipad
Land Acquisition
22-A Act
Revenue Department
Amaravati
Data Centers
Google Visakhapatnam

More Telugu News